అష్ట దిగ్గజాల సరసన ఉద్ధవ్‌ !

ముంబై : విధాన్‌ సభ, విధాన పరిషత్‌లో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఇతర ఎలాంటి సభ్యత్వ పదవులు చేపట్టకుండా నేరుగా ముఖ్యమంత్రి పదవి చేపట్టిన వారిలో శివసేన చీఫ్‌ ఉద్ధవ్‌ ఠాక్రే ఎనిమిదో వ్యక్తి. ఇదివరకు నేరుగా ముఖ్యమంత్రి పదవిలో కొనసాగిన వారిలో బారిస్టర్‌ ఏ.ఆర్‌.అంతులే, వసంత్‌దాదా పాటిల్, శివాజీరావ్‌ పాటిల్‌–నిలంగేకర్, శంకర్‌రావ్‌ చవాన్, శరద్‌ పవార్, సుశీల్‌కుమార్‌ షిండే, పృథ్వీరాజ్‌ చవాన్, తాజాగా ఉద్ధవ్‌ ఠాక్రే ఉన్నారు.  



నియమాల ప్రకారం సభాగృహంలో ఎలాంటి సభ్యత్వ పదవులు లేని వ్యక్తి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఆరు నెలల కాలవ్యవధిలో విధానసభ లేదా విధాన పరిషత్‌లో సభ్యుడు కావల్సి ఉంటుంది. లేదంటే ఆ రోజు మంత్రి పదవికి రాజీనామా చేసి మళ్లీ ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంటుంది. కానీ, అదృష్టవశాత్తు ఇంతవరకు ఎవరికీ ఇలాంటి పరిస్థితి రాలేదు. 1980లో ముఖ్యమంత్రి పదవి కోసం అప్పటి ఎంపీ  వసంత్‌దాదా పాటిల్, ఎమ్మెల్యే ప్రతిభా పాటిల్‌ పేరు చర్చల్లో ఉన్నాయి. ఎంపీ పదవికి రాజీనామా చేసిన వసంత్‌దాదా పాటిల్‌ రాష్ట్ర రాజకీయాల్లోకి రావాలని భావించారు. కానీ, కాంగ్రెస్‌ నేతలు రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిని ఎమ్మెల్యే పదవి లేని కాంగ్రెస్‌ నేత బారిస్టర్‌ ఎ.ఆర్‌.అంతులేకు కట్టబెట్టారు.


ఉభయ సభలో ఎలాంటి పదవులు చేపట్టకపోయినా ప్రమాణ స్వీకారం చేసిన మొదటి ముఖ్యమంత్రిగా అంతులేకు ఘనత దక్కింది. ఆ తరువాత జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికలో పోటీ చేసి సభాగృహం సభ్యుడయ్యారు. 1982 జనవరి 12వ తేదీ వరకు ఆయన ముఖ్యమంత్రి పదవిలో కొనసాగారు. 1982 జనవరి 21వ తేదీన బాబాసాహెబ్‌ బోస్లే ముఖ్యమంత్రి అయ్యారు. ముంబైలోని కుర్లా నియోజక వర్గం నుంచి గెలిచారు. ఆ తరువాత 1983 ఫిబ్రవరి రెండో తేదీన ఎంపీ వసంత్‌ దాదా పాటిల్‌ ముఖ్యమంత్రి అయ్యారు. ఎంపీ పదవికి రాజీనామా చేసి విధాన్‌ పరిషత్‌ ద్వారా మంత్రివర్గంలోకి వచ్చారు.